15 గిరిజన గ్రామాల గిరిజనుల‌కు తప్పని తిప్పలు 2 m ago

featured-image

''భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించి 7 దశాబ్ధాలు ముగిసి 8 వ దశాబ్దం నడుస్తున్నప్పటికీ ఆదివాసీ గ్రామాలకు, మారుమూల పల్లెల్లోని ప్రజలకు మాత్రం స్వతంత్య్రం రాలేదు. ప్రస్తుతం భారత్‌ అత్యాధునిక పరిజ్ఞానంతో ప్రపంచంతో పోటీ పడుతున్నప్పటికీ దేశానికి పట్టుకొమ్మలైన పల్లెలు మాత్రం కన్నీరు పెడుతున్నాయి. ఆదివాసీ, గిరిజన, మారుమూల గ్రామాలు అభివృద్ధికి నోచుకోకపోగా, ఆ పల్లెల్లో ఇంకా కనీస మౌళిక సదుపాయాలు లేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదు. ఒక పక్క రహదారుల సౌకర్యం లేక డోలీ మోతలు మోస్తున్న గ్రామాలుండగా మరో పక్క వాగులపై వంతెనలు లేక పడవల పైనే ఆధారపడే గ్రామాలు కోకొల్ల‌లుగా ఉన్నాయనడంలో సందేహాం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. కానీ మారుమూల పల్లెల్లోని ప్రజల జీవితాలు మాత్రం నేటికి మారడం లేదు. మన్యంలో వాగులు, వంకలు దాటుతూ, పడవలపై ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణాలు చేస్తూ ప్రాణాలను పోగొట్టుకుంటూ గాలిలో దీపాలు గిరిజనుల ప్రాణాలు అన్న చందంగా ఉంది. నూతనంగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని నేటి పరిస్థితి''

అల్లూరి సీతారామరాజు జిల్లా ఇదొక ఆదివాసీ ప్రత్యేక జిల్లా, ఏర్పడి రెండేళ్ళు పూర్తి చేసుకున్నప్పటికీ, ఈ ఆదివాసీ జిల్లా ఇంకా అభివృద్ధికి ఆమడదూరంలోనే ఉంది. ఈ జిల్లాలో మొత్తం 22 మండలాలు ఉండగా ముంచంగిపుట్టు మండలంలో 23 గ్రామ పంచాయితీల పరిధిలో మొత్తం 372 గ్రామాలు ఉన్నాయి. ఈ మత్స్యగడ్డ పరిసరాల్లో 8 గ్రామ పంచాయతీలకు గాను 86 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఇప్పటికీ చాలా గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు కదా కనీసం కాలిబాటలు కూడా లేని గ్రామాలెన్నో ఉన్నాయి. ప్రజలకు సాగునీటి సౌకర్యం కల్పనలో భాగంగా బ్రిటీషర్ల హయాంలో జోలాపుట్టు రిజర్వాయర్‌ నిర్మించిన నాటి నుంచి దారెల, పెదగూడ, సుజనకోట, పనసపుట్టు, జోలాపుట్టు, మాకవరం పంచాయతీల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు నీటి ముంపు సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఏడాదిలో దాదాపు ఆరు నెలల పాటు గెడ్డలో నీటి ప్రవాహం ఉధృతంగానే ఉంటుది. నిత్యావసరాలతోపాటు, అత్యవసర వైద్యం, ఇతరత్రా పరిస్థితుల్లో నాటు పడవలే శరణ్యం. జోలాపుట్టు రిజర్వాయర్‌లో కొంచెం నీటిమట్టంపెరిగినా 15 గ్రామాలు ముంపు బారిన పడుతుంటాయి.

మృత్యువులకు అడ్డా మత్స్య గెడ్డ

అల్లూరి జిల్లా మన్యంలోని మత్య్సగెడ్డ మృత్యువులకు అడ్డాగా మారింది. ముంచంగిపుట్టు మండలంలోని మత్స్యగెడ్డ అవతలి వైపు ఉన్న 15 గ్రామాల ప్రజల దుస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఈ గ్రామాల ప్రజలు ఏ చిన్న పని ఉన్న మత్స్యగెడ్డ దాటాల్సిందే. జీవన గమనంలో ఏరు దాటటం పరిపాటి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు నాటు పడవలను ఆశ్రయించి, ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సిన దీనస్థితి. ఈ పడవలు శిథిలమై, రంధ్రాలు పడి వీటి లోపలకు నీరు చేరతున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాలకు గురై చాలామంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి.

ప్రాణాలు హరిస్తున్న తప్పని ప్రయాణాలు

పడవ ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఈ మత్య్సగడ్డ ప్రజల ప్రాణాలను హరిస్తుంది. పడవ ప్రయాణం ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ఆ ప్రాంత ప్రజలు ప్రాణాలను ప‌ణంగా పెట్టి పడవ ప్రయాణాలు చేస్తున్నారు. ఈ మత్స్యగెడ్డ పరిసర ప్రాంతాలైన పనసపుట్టు, సుజనకోట, పెదగూడ, ధారెల, వనుగుమ్మ, జోలాపుట్టు, మాకవరం, రంగబయలు పంచాయతీల పరిధిలో సుమారు 86 గ్రామాల మీదుగా మత్స్యగెడ్డ విస్తరించి ఉంది. ఈ గ్రామాల ప్రజలు నిత్యం ప్రాణాలతో పోరాడుతూ జలంలో ప్రయాణం చేస్తూ జల సమాధి అవుతున్నారు. పడవలపై ప్రయాణించే మండల, పంచాయతీ కేంద్రాలకు పనుల కోసం వస్తారు. గిరిజన మత్స్యకారులు సైతం ఈ పడవలపై వెళ్లి చేపల వేటకు వెళ్తారు. ఈ తరుణంలో పడవలు ప్రమాదాలకు గురైన ఘటనల్లో అనాధికారిక లెక్కల ప్రకారం సుమారు 86 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారనే వాదనలు ఉన్నాయి.

తాడు తెగితే తిరిగిరాని లోకాలకే

ముంచంగిపుట్టు మండలంలోని సుజనకోట పంచాయతీ పరిధిలోని కుమ్మరిపుట్టు వద్ద నిత్యం గిరిజనులు తాడు సాయంతో పడవలపై ప్రయాణాలు సాగిస్తుంటారు. ఈ ప్రయాణంలో తాడు తెగిన, ఆ తాడు పట్టు తప్పిన పడవలో ప్రయాణించే వారంతా పైలోకాలకి, తిరిగిరాని లోకాలకి వెళ్ళాల్సిందే. అదృష్టవంతులు ఒక్కరో, ఇద్దరో బయటపడతారు తప్ప మిగిలిన వారు మొత్తం జల సమాధి కావాల్సిందే. ఈ జీవన గమనంలో ఆదివాసీలు తమ ప్రాణాలను అరి చేతిలో పెట్టుకొని పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు.

పడవ ప్రమాదాల్లో జల సమాధి అయిన వారి వివరాలు ఇలా....

క్రమ సంఖ్య ప్రమాదం జరిగిన సంవత్సరం పంచాయతీ ప్రమాదం జరిగిన ప్రదేశం మృతుల సంఖ్య

1 2004 సుజనకోట కుమ్మరిపుట్టు ఆరుగురు చిన్నారులు

2 2011 పెదగూడ గలగండ గ్రామం ముగ్గురు గిరిజనులు ఒడిస్సా వెళ్ళి వస్తుండగా ఘటన

3 2014 రంగబయలు కోసంపుట్టు, పట్నపడాల్పుట్టు ఐదుగురు చిన్నారులు వారంతపు సంతకు వెళ్ళి వస్తుండుగా ఘటన

4 2013 రంగబయలు వచ్నిపడాలపుట్టు ఇద్ద‌రు గిరిజనులు మత్య్సగెడ్డ దాటుతుండగా

5 2015 రంగబయలు పట్నపడాల్పుట్టు ఇద్ద‌రు గిరిజనులు నిత్యావసర వస్తువుల కోసం వెళ్తుండగా ఘటన

6 2017 ధారెల పెద్ద పేట ముగ్గురు చిన్నారులు చేపలు వేటాడుతుండగా ఘటన

7 2022 వనుగుమ్మ పనస ఇద్ద‌రు మృతి

8 2024 ధారెల పెద్దపేట ఒక‌రు గల్లంతు (వేణు గోపాల స్వామి)

నేతల మాటలు నీటి మీద రాతలు

ప్రమాదాలు జరిగినపుడు చుట్టం చూపులా వచ్చి పరామర్శలు చేస్తున్న నేతలు, ఎన్నికల సమయంలో మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని హామీలు ఇచ్చిన నేతల మాటలు, ఆ నీటి మీద రాతలగానే మిగులుతూ, ఆ నీటిలో గిరిజ‌న‌ ప్రజల ప్రాణాలు పోతున్నాయే తప్ప నేతల హామీలు మాత్రం నేటికి అమలుకావడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ప్రజా ప్రతినిధులు, మంత్రులు స్పందిస్తున్నారు తప్ప కొద్దిరోజులకే మర్చిపోతున్నారు.

ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వేడుకోలు

ఈ ప్రాంతంలో వంతెన నిర్మించాలని కొన్నేళ్లుగా గిరిజనులు ఉద్యమాలు చేస్తూ వేడుకుంటున్నప్పటికీ ఆదివాసీల బాధ, వ్యధ నేటికి ఏ ప్రభుత్వం కూడా అర్ధం చేసుకోవడం లేదు అనడంలో ఎటువంటి సందేహాం లేదు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నప్పటికీ ఈ ప్రాంత ప్రజల జీవితాలు ఏకోశాన మారడం లేదు కదా, కనీసం పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. మత్స్యగెడ్డను దాటేందుకు ఫైబర్‌ బోట్లు, ఇంజన్‌ బోట్లు, స్టీమర్లు లాంటి ప్రమాదం జరిగనవి ఇవ్వాలని ఈ ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

కుమ్మరిపుట్టు వద్ద వంతెన నిర్మించాలి

ముంచంగిపుట్టు మండలంలోని కుమ్మరిపుట్టు వద్ద వంతెన నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వంతెన నిర్మాణం చేపడితే సుమారు 86 గ్రామాల ప్రజల కష్టాలు తీరుతాయి. పడవలపై ప్రయాణాలు తప్పి ప్రాణాలు పోయే పరిస్థితి పోతుంది. మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని కుమ్మరిపుట్టు వద్ద‌ వంతెన నిర్మించి ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న గిరిజన ప్రజల కలను నేరవేర్చాలని ఆశిద్దాం.

రవాణా సౌకర్యాలు లేక - పాఠశాల విద్యార్ధులకు తప్పని తిప్పలు

దారెల పంచాయతీలోని రంగిలిసింగి, మురళిపుట్టు, డొక్రిపుట్టు, కుమ్మరిపుట్టు, పేటమాలిపుట్టు, పెదపేట గ్రామాలు మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. ఈ గ్రామాల్లోని విద్యార్థులు, రైతులు, గిరిజనులు ప్రయాణాలు సాగించేందుకు రవాణా, రోడ్డు సౌకర్యం లేక పెదపేట సమీపంలో పడవల మీద ప్రయాణాలు చేస్తున్నారు. ఈ గ్రామాల్లోని విద్యార్ధులు పాఠశాలకు వెళ్ళాల‌న్న‌ తిప్పలు తప్పడం లేదు. విద్యార్ధులు సైతం ప్రాణాలను ప‌ణంగా పెట్టి పడవల మీద ప్రయాణం చేసి పాఠశాలలకు చేరుకుంటున్నారు.

ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు

కుమ్మరిపుట్టు గెడ్డపై వంతెనను నిర్మిస్తే 15 గ్రామాల ప్రజల కష్టాలకు విముక్తి కలుగుతుంది.

గిరిజనుల ప్రాణాల రక్షణకు, తాత్కాలికంగా సురక్షిత రాకపోకలకు వీలుగా ఇంజిన్‌ పడవలను ఏర్పాటు చేయాలి.

రోగులపేట, పెదపేట మధ్య వంతెన నిర్మిస్తే కేవలం ఒక కిలోమీటర్‌ దూరంతో ప్రయాణాలు పూర్తి అవుతాయి.

ప్రభుత్వం పెదపేట నుంచి మురళిపుట్టు వరకు, దారెల నుంచి పెదగుడ వరకు రహదారి నిర్మించి బస్సు సదుపాయం కల్పించాలి.

కుమ్మరిపుట్టు వద్ద తాడు ఆధారంగా నడిపే పడవలకు బదులుగా ఇంజిన్‌ బోట్లు ఏర్పాటు చేయాలి.

ఈ గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు స్టీమర్‌ పడవలు ఏర్పాటు చేయాలి.

గిరిజన ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలి : వెంగడ రమేష్‌, సర్పంచ్‌, సుజనకోట పంచాయతీ.

మత్స్యగెడ్డ పరిసర ప్రాంత గిరిజన ప్రజల శాశ్వత పరిష్కారం చూపాలి. ఈ గెడ్డలో అనేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్ళిన పట్టించుకోవడం లేదు. జోలాపుట్‌ నిర్మాణంతో ఆదివాసీ ప్రజల బ్రతుకులు చిద్రమయ్యాయి. అత్యవసర సమయాల్లో అనేక కష్టాలు పడుతున్నాము. జేన్కో సంస్థ నుండి మౌళిక సదుపాయాలు, వంతెనలు నిర్మించేలా చర్యలు చేపట్టాలి. మా గిరిజన ప్రాణాలను ఇకనైనా ప్రభుత్వాలు కాపాడాలి. పడవ ప్రమాదాల ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి.

చిన్న లాంచీలను ఏర్పాటు చేయాలి : కిలో క్రిష్ణ, వార్డ్‌ మెంబర్‌, సుజనకోట పంచాయతీ///

ఈ ప్రాంత ప్రజల కోసం చిన్న లాంచీలను ఏర్పాటు చేయాలి. అప్పుడే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది. పైబర్‌ బోట్లు ఇస్తున్నారు కానీ అవి కొంత కాలానికే మర్మమత్తుల‌కు గురై మళ్ళీ మొదటికి వస్తుంది. ప్రస్తుతానికి ఇంజన్‌ బోట్లు మంజూరు చేయాలి. చిన్న చిన్న వంతెనలు నిర్మిస్తే మా గ్రామాల కష్టాలు తీరుతాయి. అధికారులు ఆ దిశగా అడుగులు వేసి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలి.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD